Sunday 21 June 2009

తెలంగాణ వస్తదా?

అందరికి నమస్తే.. అందరూ ఈ మద్యన తెలంగాణ,తెలంగాణ అంటున్నరు..నాకైతె ఏమర్దమయిత లేదు. ఒకల్లేమొ కె.సి.ఆర్. ని చెప్పుతొతి కొట్టాలె అంటున్నరు.ఒకల్లెమొ కె.సి.అర్. మంచోడంటున్నరు.. ఇవన్నెమొ గని నాకు మాత్రం ఒక విషయంల కె.సి.అర్ ని మెచ్చుకోవాలె అనిపిస్తది. ఎందుకంటరా? గీ కె.సి.అర్ ఎ ఉద్దెశంతోటైతేంది.తెలంగాణ అనె అంశాన్ని పైకి దెచ్చిండు.. గా ఒక్క విషయంల నేను కె.సి.అర్ మంచిగ చేసిండని ఒప్పుకుంట.. కె.సి.అర్ జెసిన తప్పేంది అంటె ఉద్యమాన్ని బలహీనం జేసిండు, అంటె రెడ్డొచ్చె మళ్ళీ మొదలన్నట్టు. ఇప్పుడు కె.సి.ఆర్ మీద కొపానికచ్చెటొల్లు గీ పని చానా ముందు యేసేదుండె.. ఉద్యమం అనేది కొత్త ఊపుతోటి ఉండేది. ఇంగ ఉద్యమమంటరా కె.సి.ఆర్. ఉన్న ఉంటది లేకపొయినా ఉంటది..
రెండో విషయమేందంటే తెలంగాణ ఫస్టునుంచి నిజాం జాగిర్లుండే. ఆంధ్రప్రాంతానికి మనకంటే ముందు స్వాతంత్ర్యం అచ్చే. వాళ్లు ఫస్టునుంచి చదువు విషయంల అశ్రద్ధ చెయ్యలే. మనోళ్ళకు సదువంటే అస్సలు వడకపాయే. ఆ ఒక్కవిషయం మనోల్లని ఎన్కకు తోసింది. ఇప్పటికయినా మనోళ్ళు ఒకళ్ళమీద ఒకళ్ళు దుమ్ము వొస్కున్డాపి కలిసి పంజేస్తే తెలంగాణ అచ్చుడుపెద్ద విషయ్మగాదని నా కనిపిస్తంది

తెలంగాణ మాండలీక పదాలు - వాటి అర్థాలు-2

బొక్కెన = బావిలోంచి నీళ్లు తోడే చిన్న బకెట్టు
బుక్కు = తినడం, పిండి బుక్కు(పిండి వస్తువులు తినడం)
ఇడుపుకాయిదం = విడాకులు
చప్రాసి = బంట్రోతు, అటెండర్
సందుగు = పెట్టె (కర్ర లేదా ఇనుముతో చేసింది)
బోళ్ళు = వంట గిన్నెలు
గిలాస = గ్లాసు
సలాక = శలాక, ఇనుప కడ్డీ
సక్కగ = సరిగా, స్ట్రయిట్గా
నకరాలు = వేదవ్వేషాలు
కొత్తిమీర్లు = ధనియాలు
ఒర్రు = వదరు
సిర్రగోనే = బిళ్ళంగోడు
బయాన = అడ్వాన్సు
నపరోటి = మనిషికొకటి
సర్పు = చరచు
మార్మానం = రెండో పెళ్లి, (మరో పెళ్లి - భర్త చనిపోతే)
ఇల్లుటం = ఇల్లరికం
సకినాలు = చక్కిలాలు
సర్వపిండి = తపేలా చెక్కలు
మస్తు = బాగా
బాయి = బావి
సవురం = క్షవరం
షడ్డకుడు = తోడల్లుడు
యారాలు = తోడి కోడలు
ఆడబిడ్డ = ఆడబిడ్డ

Friday 12 June 2009

తెలంగాణ సామెతలు -1

"సచ్చినోని శవం ఎల్లెల్కలైతేంది?, బోర్లబొక్కలైతేంది?"
చనిపోయినవాడి శవం వెల్లకిలా ఉన్నా బోర్లా పడ్డా ఒకటేనని అర్థం
"మొగోన్నని మొల్కల్కవోయి ఎల్కన్ జూసి ఎల్లెల్కల వడ్డడట!"
పెద్ద మగాన్నని వరి నాట్లు వెయ్యడానికి వెళ్లి ఎలుక అలికిడికి వెల్లకిలా పడ్డాడు.
"ఊపిర్లేనోడు ఉర్కవోతే, పాణం లేనోడు పట్టవోయిండట"
శ్వాస ఆడని వ్యక్తి పరుగెత్తడానికి వెళితే నీరసంగా ఉన్న వ్యక్తి పట్టుకోడానికి వెళ్ళాడు.
"ఊరోన్కిఊరాపతి, ఊసుకండ్లోనికి దోమలాపతి"
ఎవరి బాధ వారిది అని దీనర్థం
"మాడ్పుమొకం ఈడ్పు కాళ్ళు"
ఏడుపు గొట్టు మొహంతో పని చేసేందుకు వెళితే పని కాదని అర్థం.
"మందిమాటలిని మార్మానం బోతె మల్లచ్చెసరికి ఇల్లు కాలిపోయిందట"
వాళ్ళ మాటలూ, వీళ్ళ మాటలూ విని ఉన్న మొగుడ్ని వదిలేసి వెరే ఎవరితోనొ
వెళ్ళిపోయి అతను వదిలేస్తే తిరిగి ఇంటికి వచ్చేసరికి ఉన్న ఇల్లూ కాలిపొయి ఉందట!
"అగ్గోలె లగ్గమచ్చినట్టు"
తొందరపాటు తనం


తెలంగాణ మాండలీక పదాలు - వాటి అర్థాలు-1

సకులంముకుళం = బాసింపట్టు
సందుగు = పెట్టె
తీర్లమర్ల = వెనుకది ముందుకు, ముందుది వెనక్కి
ఆగమాగం = ఆదరాబాదరా
ఎల్లేల్కల = వెల్లకిలా
బోక్కబోర్ల = బోర్లా
నడిమిట్ల = మధ్యలో
ఇలపీట = కత్తిపీట
బరివాతల = నగ్నంగా
యిమానం = ఒట్టు వేయడం
నిబద్దె = నిజంగా
నువ్వద్దె = నిజంగా